తల్లిదండ్రులను పూజించాలి. ఏ స్థితిలోనూ దూషించరాదు.
మంత్రోపదేశం చేసినవారు మాత్రమే గురువు. (తక్కిన విద్యలు నేర్పినవారు అధ్యాపకులు మాత్రమే) అట్టి గురువును ఏ పరిస్థితిలోనూ నిందించరాదు. ఆయన ఎదురుగా కాళ్ళుచూపి కూర్చోరాదు.
భోజనం తూర్పు, ఉత్తర దిక్కులవైపు కూర్చొని చేయాలి.
చిన్న పిల్లల్ని చూడ్డానికి వెళ్ళేటప్పుడు, అనారోగ్యవంతుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, గుడికి వెళ్ళేటప్పుడు, గురుదర్శనానికి వెళ్ళేటప్పుడు, పురాణం వినటానికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళరాదు. ఏదో ఒకటి సమర్పించుకోవాలి
భోజనానంతరం ఎంగిలి ఆకులు ఎత్తే వాడికి వచ్చే పుణ్యం అన్నదాతకు కూడా రాదు.
తల్లిదండ్రులకు నిత్యపాద నమస్కారం చేయడానికి మించిన ధర్మం, నిత్యాన్నదానం చేయడం కంటే మించిన పుణ్యం ఈ సృష్టిలో లేవు.
ఒకేసారి నీరు, నిప్పు రెండు చేతులతో గాని, ఒకే చేత్తోగాని పట్టుకెళ్ళరాదు.
తూర్పు, దక్షిణ దిక్కుల తల పెట్టి నిద్రపోవాలి, ఉత్తర, పశ్చిమాల వైపు తల పెట్టి నిద్రిస్తే వారు ప్రమాదాల పాలౌతారని మార్కండేయ పురాణం చెబుతుంది.
ఇంటికి గురువు వస్తే టక్కున లేచి నిలబడి ఎదురుగావెళ్ళి లోపలికి గౌరవంగా తీసుకొని వచ్చి ఆసనం వేసి కూర్చోబెట్టకుండా మాట్లాడరాదు. సాగనంపేటపుడు బయటకు వచ్చి గురువుని కొంచెం దూరం అనుసరించాలి.
పైన అనగా భుజాలమీదుగా వస్త్రం లేకుండా దైవపూజ చేయరాదు, భోజనం చేయకూడదు.
రెండు చేతులతో ఎప్పుడూ తల గోక్కోరాదు.
ఇతరుల చెప్పులు, వస్త్రాలు ధరించకూడదు.
తెలిసినవారి మరణ వార్త విన్న వెంటనే గాని, పురిటి వార్త విన్న వెంటనే గాని కట్టుబట్టలతో స్నానం చేయాలి.
అన్నము తిన్నాక కంచంలో చేయి కడుక్కోరాదు. చేయి కడిగిన తరువాత ఆ చేతిని విదల్చరాదు.
పుష్కర స్నానాదులలో చొక్కాతో స్నానం చేయరాదు. కండువా మాత్రమే ఉండవలెను.
ఆదివారం, శుక్రవారం, మంగళవారం తులసి ఆకులు కోయరాదు.
కూర్చొని తొడలు, కాళ్ళు ఊపరాదు. అలా ఊపినవాడు వచ్చే జన్మలో కుంటివాడై పుడతాడు.
చీకటి పడ్డాక పువ్వులు, ఆకులు చెట్లనుండి త్రుంచరాదు.
నిద్రనుండి లేవగానే ముందుగా అరచేతులను దర్శించి వామన నామస్మరణ చేయాలి.
నిజం తెలుసుకోకుండా ఎవరినీ నిందించరాదు, అభాండాలు వేయరాదు. అలా చేస్తే అవతలి వారి పాపాలన్నీ అభాండాలు వేసిన వారి తలకు చుట్టుకుంటాయి.
శవాన్ని స్మశానం దాకా మోసినా, శవాన్ని ఇంటి దగ్గర ఉండటానికి అనుమతినిచ్చినా మనం స్వర్గానికి పోతాము.
నిద్రపోతున్న వారిని అనవసరంగా లేపుట, పురాణ కథలు జరుగుతున్నపుడు విఘ్నం కలుగ చేయుట, భార్యాభర్తలను విడదీయుట, తల్లిని బిడ్డను విడదీయుట బ్రహ్మహత్యాపాతకాలతో సమానం. (వేళాపాళ లేకుండా నిద్రించేవారి విషయంలో వర్తించదు.
పుట్టిన రోజునాడు దీపాలు కానీ, కొవ్వొత్తులు కానీ ఆర్పరాదు. నోటితో అగ్నిని ఊదుట ఘోరపాపం. అటువంటివారు గ్రహణపు మొర్రితో మళ్ళీ జన్మమెత్తి దుఃఖాలు పొందుతారు.
ఎంగిలి నోటితో గురువుతో మాట్లాడరాదు. ఎంగిలి చేత్తో ఏ పదార్థాన్ని చూపించరాదు.
పురాణాలు దానం చేస్తే గొప్ప విద్యావేత్తలు అవుతారు.
క్రూరుడు, దుష్టుడు కాని మగనితో తాళికట్టించుకొన్న భార్య, కాపురం చేయక ఏడిపించటం, చెప్పిన మాట వినకపోవటం, తాళి తీసి భర్త చేతిలో పెట్టడం చేయరాదు. ఇలా చేసిన స్త్రీలకి వంద జన్మలలో వైధవ్యం కానీ, అసలు పెళ్లి కాకపోవడం జరుగుతుంది.
దీపాలు పెట్టేవేళ తలదువ్వుకోరాదు. ఇలా చేసిన స్త్రీలకి వందల జన్మలలో వైధవ్యం కాని, అసలు పెళ్లి జరగకపోవడం వంటివి జరుగుతాయి.
తలమీద రెండు చేతులు ఒకేసారి పెట్టుకొనరాదు.
వికలాంగులను వేళాకోళం చేయరాదు.
ఒకరి బట్టలు మరొకరు కట్టరాదు. ఒకరు తీసివేసిన జందెం మరొకరు ధరించరాదు.
సంకల్పం చెప్పకుండా నదీస్నానం పనికిరాదు. ఒకవేళ చేస్తే ఇంటిలో స్నానం చేసినట్లే. నదీస్నాన ఫలితంరాదు.
ఉమ్మితో వెళ్ళు తడిపి పుస్తకంలో పుటలు తిప్పరాదు.
వ్యసనపరులతో, మూర్ఖులతో వాదోపవాదనలు చేయరాదు.
ఏడవటం వలన దారిద్ర్యం, సంతోషం వలన ఐశ్వర్యం లభిస్తాయి.
భోజన సమయంలో మాట్లాడుట, నవ్వుట పనికిరాదు.
పెద్దన్న గారు, పిల్లనిచ్చిన మామ గారు, గురువు ఈ ముగ్గురు కన్నతండ్రితో సమానం కనుక వీరు ముగ్గురినీ తండ్రిలాగే పూజించాలి.
ఒకసారి వెలిగించాక ఏ కారణం చేతనైనా కొండెక్కిన దీపంలోని వత్తిని తీసివేసి క్రొత్త వత్తిని వేసి మాత్రమే దీపారాధన చేయాలి. పాత వత్తిని మళ్ళీ వెలిగించరాదు.
ఒక చెట్టును నరికేముందు మూడుచెట్లు నాటితే కాని ఆ దోషం పోదు.
అన్నమును తింటున్నపుడు ఆ అన్నమును దూషించుట కాని, కోపముతో అన్నం పెట్టేవారిని తిట్టుటకాని చేయరాదు.
నదిలో చీమిడి చీదుట, ఉమ్ముట, చిల్లర డబ్బులు వేయుట దోషం.
ఒడిలో కంచం పళ్ళాలు పెట్టుకొని ఏ పదార్థాలు తినరాదు. అలా చేస్తే ఘోర నరకాలు కలగటమే కాక, వచ్చే జన్మలో దరిద్రులై పుడతారు
చీటికి మాటికి తనను తాను నిందించుకొనుట, అవమానించుకొనుట, తక్కువ వేసికొనుట చేయరాదు.
గురువుద్వారా మంత్రోపదేశం పొందనివాడు ఎప్పటికీ తరించలేడు. కనుక ఉపదేశం పొందితీరాలి.
చెట్లు, దేవతా విగ్రహాలు ఈశాన్యంలో ఉంటే వాటిని బరువులుగా భావించి తీసివేసేవారు, తీసివేయమని సలహా ఇచ్చేవారు ఏడు జన్మలు ఉబ్బసపు రోగులుగా పుడతారు. ఈ పనులు చేయుట దైవద్రోహం కనుక చేయరాదు.
గురువులకు, అర్చకులకు, పౌరాణికులకు సరిగా పారితోషంఇవ్వక, వారికి ఋణపడేవారు నూరుజన్మలు కుక్కలుగా, చండాలురుగా పుట్టి కష్టనష్టాల పాలవుతారు.
శివలింగార్చన ఆడువారు కూడా చేయవచ్చు.
ఇంట్లో విగ్రహాలుంటే ఏమీ ప్రమాదం లేదు. పరులకు అపకారం కోరి పూజ చేసేవారికి మాత్రమే నియమాలు. తక్కిన వారికి పూజా విషయాలలో పెద్ద పెద్ద నియమాలు లేవు
ఎంతకోపం వచ్చినా తల్లిదండ్రులను, గురువును కొట్టరాదు. వారిపైకి చేయి ఎత్తరాదు. ఇంటి నుండి గెంటివేయరాదు. వారికి పెట్టకుండా పదార్థాలేవీ తాను తినరాదు.
పాచి ముఖంతో అద్దం చూసుకొనరాదు.
మేడి చెట్టుకు ప్రదక్షిణ, రావి చెట్టుకు పూజ, వేప చెట్టును నాటుట, మామిడి పళ్ళు దానం అశ్వమేథ యాగ ఫలితాన్ని ఇస్తాయి.
తీర్థం తీసుకున్నాక, ఆ చేతిని కడుక్కోవాలి తప్ప, అరచేతిని తలపై రాసుకొనరాదు.
పాడయిపోయిన లేక శిథిలమైపోయిన దేవతల పటాలు లేక విగ్రహాలు కాలువలో కాని, చెరువులో కాని, సముద్రంలో కాని కలుపవలెను. ఏమీ లేకపోతే గొయ్యి తీసి అందులో పాతిపెట్టవలెను.
శివాలయంలో నందికి దగ్గరగా దీపారాధన చేయరాదు. కొంచెం దూరం ఉంచాలి.
తల వెంట్రుకలతో కూడిన అన్నం పండితులకు, గురువులకు పెట్టరాదు. సాధ్యమైనంత జాగ్రత్త వహించాలి. పొరపాటున అన్నంలో వెంట్రుకలు వస్తే ఆ అన్నం తీసివేసి మళ్ళీ వడ్డించి నేయి వేయాలి.
దీపారాధనకు ఒక కుంది మాత్రమే వాడినపుడు మూడు వత్తులు వేయాలి.
అష్టమి, పూర్ణిమ, చతుర్థశి కాలలో స్వయంపాకం దానం చేస్తే అన్నపానాలకు ఏనాడు లోటుండదు.
ఎక్కువ వేడిగా, ఎక్కువ చల్లగా ఉండే పదార్థాలు స్వీకరించరాదు.
భోజనం చేసిన వస్త్రాలు ఉతికి ఆరవేయకుండా వాటితో దైవపూజ చేయరాదు.
నిత్యం తామువాడే పాత్రలలో పండితులకు ఆహారం పెట్టుట దోషం, కనుక ఆకులలోకాని, క్రొత్త పాత్రలలోకాని వారికి ఆహారం పెట్టాలి.
గృహప్రవేశ కాలంలో గాని, ఏడాదిలోపు గాని ఆ ఇంట మణిద్వీప పరాయణం చేయడం మంచిది. ఇది వాస్తుదోషాలను పరిహరిస్తుంది.
భోజనానికి ముందు, అనంతరం కూడా కాళ్ళు కడుక్కోవాలి.
సకల పురాణేతిహాస కోవిదుడు కాని వాని వద్ద మంత్రోపదేశం పొందరాదు.
రేపు చేయవలసిన పనిని ఈ రోజు, ఈ రోజుపని ఈ క్షణమే చేయాలి. వాయిదాలు పనికిరావు.
తలకి నూనె రాసుకొని ఆ చేతులతో పాదాలకు ఆ నూనెజిడ్డు పులమరాదు.
శుక్ర, శనివారం వంటి వార నియమాలు పెట్టుకున్నవారు హోటలు టిఫిన్లు తినుటగానీ, ఆనాటి అల్పహారాదులలో ఉల్లి వాడుట కాని నిషేదము. ఇది ప్రయాణ మధ్యంలో ఉన్న వారికి వర్తించదు.
చీటికి, మాటికి యజ్ఞోపవీతం తీసి పక్కనపెట్టడం, తాళి తీసేస్తుండటం రెండూ భయంకర దోషాలే.
పుష్కర సమయాలలో స్నానం, శ్రాద్ధకర్మ ఎవరైనా చేసి తీరాల్సిందే.
ప్రదక్షిణలు చేసేటపుడు, మంత్ర పుష్పం ఇచ్చేటపుడు ఆసనాలపై నిలబడరాదు. కింద నిలబడి చేయాలి. పూజా సమయాలలో కొందరు చాపలు పీకుట, దర్భాసనాలు తుంచటం చేస్తారు. ఇవి మహా పాపాలు.
గణపతి గరికపూజ మహాప్రీతి ఏ పరిస్థితులలోనూ తులసితో పూజ చేయరాదు(వినాయక చతుర్థినాడు కుడా తులసిని సమర్పించరాదు.
మనుష్యుని పాపం వాడి అన్నం లోనే ఉంటుంది. అందువలన పాపాత్ముల ఇంటి భోజనం చేయరాదు. మంత్రోపదేశం చేసిన గురువు భోజనానికి పిలిస్తే వెళ్ళని వానికి ఏనాటికీ మోక్షంరాదు.
బంగారం దొరికితే దానిని ఇంట్లోకి తెచ్చుకోరాదు. దాని వల్ల చాలా అనర్థాలు జరుగుతాయి. దొరికిన బంగారం వెంటనే దానం చేయుట కాని, లేదా దేవాలయాలకు ఇచ్చివేయుట కాని చేయాలి.
దీపారాధనకు అగ్గిపెట్టె వాడకూడదని ఏ శాస్త్రాలు చెప్పలేదు. కనుక అగ్గిపెట్టెతో దీపం వెలిగించుకోవచ్చు.
0 Comments