Ad Code

National Geographic Exclusive, Inside Tirumala Tirupati on 27th March, 9 PM

National Geographic Exclusive, Inside Tirumala Tirupati on 27th March, 9 PM

A National Geographic exclusive, Inside Tirumala Tirupati, Premieres on 27th March, 9 PM.




నేషనల్‌ జియోగ్రాఫిక్‌ చానల్‌లో వెంకన్న వైభవం


  • ‘తిరుమల తిరుపతి ఇన్ సైడ్‌ స్టోరీ’ పేరుతో డాక్యుమెంటరీ
  • 27న రాత్రి 9 గంటలకు ప్రసారంరెండు ఎపిసోడ్‌లు..
  • 43 నిమిషాలుభక్తి పారవశ్యాన్ని,
  • మన తిరుమల అందాలను ఒడిసిపట్టిన ఎన్జీసీఆరుగురు సభ్యుల బృందం..
  • 20 రోజుల చిత్రీకరణ


పచ్చటి ప్రకృతి.. చల్లగా ఆహ్లాదకరంగా ఉండే వాతావరణం.. మంద్రస్థాయిలో ఎల్లెడలా వినిపించే అష్టాక్షరీ మంత్రం.. భక్తబృందాల గోవింద నామాల ప్రతిధ్వని.. వేలు, లక్షల సంఖ్యలో ఆ స్వామిని దర్శించుకోవడానికి వెల్లువెత్తే భక్తులు.. కొండమీదే కొన్ని రోజులు ఉండిపోయి మరీ శ్రీనివాసుడి సేవలో తరించే ‘శ్రీవారి సేవ’కులు.. నిత్యం ఉచితంగా వేలాదిమంది ఆకలి తీర్చే అన్నసత్రాలు.. బ్రహ్మోత్సవ వైభవాలు, నిత్యసేవలు, అలంకార వైభోగాలు! నిత్యకల్యాణం పచ్చతోరణంగా కళకళలాడే తిరుమల వైభవం నేషనల్‌ జియోగ్రాఫిక్‌ చానల్‌నూ ఆకర్షించింది!! ఒక్క తిరుమలేశుడి వైభవంపైనే.. తిరుమల ప్రాశస్త్యం పైనే 43 నిమిషాల డాక్యుమెంటరీ నిర్మించింది!! ఆ డాక్యుమెంటరీ ఈ నెల 27న రాత్రి నేషనల్‌ జియోగ్రాఫిక్‌ చానల్‌లో ప్రసారం కానుంది.

 సాలగ్రామమయమై.. అణువణువునా ఆ బ్రహ్మాండ స్వరూపుడు నిండి నిబిడీకృతుడైన తిరుమల క్షేత్ర మహిమపై నేషనల్‌ జియోగ్రాఫిక్‌ చానల్‌ (ఎన్జీసీ) ఒక డాక్యుమెంటరీని రూపొందించింది. పరికించి చూస్తే తిరుమల క్షేత్రంలో ప్రతిదీ అద్భుతమే. ఎన్జీసీ బృందం ఆ అద్భుతాలను మరింత అద్భుతంగా చిత్రీకరించింది. ‘‘తిరుమల తిరుపతి ఇన్ సైడ్‌ స్టోరీ’’ పేరుతో డాక్యుమెంటరీని తయారు చేసింది.


మెగా కిచెన్ కాన్సెప్ట్ తో వచ్చి..

దేశంలోని ప్రముఖ ఆలయాల్లో యాత్రికులకు కల్పిస్తున్న భోజన, వసతి ఏర్పాట్లను ‘మెగా కిచెన్‌’ పేరుతో డాక్యుమెంటరీగా ప్రసారం చేయాలని ఎన్జీసీ సంకల్పించింది. అందులో భాగంగానే.. పలు ఆలయాల్లో పాకశాలలను చిత్రీకరించింది. తిరుమలలోనూ అలాగే నిత్యాన్నదాన పథకం, భోజన తయారీ, వడ్డింపు ప్రక్రియలను చిత్రీకరించేందుకు ఆ చానల్‌ ప్రతినిధులు తిరుమలకు వచ్చారు. కానీ, అక్కడి వైభవాన్ని చూసి మైమరచిపోయిన వారు తమ మనసు మార్చుకున్నారు. క్షేత్రంలోని ప్రత్యేకతలన్నింటికి కలిపి ప్రత్యేకంగా తిరుమల మీదనే ఒక డాక్యుమెంటరీ చిత్రీకరించాలనే నిర్ణయానికి వచ్చారు.

ఆరు నెలల ముందే పరిశీలన 

ఒక ప్రదేశాన్ని లేదా ఒక అంశాన్ని చిత్రీకరించాలంటే ఎన్జీసీ చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ప్రసారం చేయబోయే అంశాలకు సంబంధించి ముందస్తుగా సమగ్ర అధ్యయనం చేస్తుంది. ఆ క్రమంలోనే తిరుమల క్షేత్రాన్ని ఎనజీసీ సాంకేతిక బృందం ఆరు నెలలకు ముందే సందర్శించి క్షుణ్నంగా పరిశీలించింది. ఆ తర్వాత..ప్రొడ్యూసర్‌, డైరెక్టర్‌ రాజేంద్ర నేతృత్వంలో.. ఇద్దరు కెమెరా మెన్‌, ఒక స్ర్కిప్ట్‌ రైటర్‌, ఇద్దరు అసిస్టెంట్లు.. వెరసి ఆరుగురు సభ్యుల చానల్‌ బృందం ఈ చిత్రీకరణలో పాల్గొంది. రికార్డింగ్‌కు రెండు కెమెరాలు వినియోగించారు. మే నెలలో 10 రోజులు, బ్రహ్మోత్సవాల సందర్భంగా అక్టోబర్‌లో పది రోజులకు పైగా తిరుమలలో ఉండి చిత్రీకరించారు.

భక్తి పారవశ్యానికి పెద్ద పీట 

తిరుమల క్షేత్ర వైభవానికి ప్రధాన కారణం యాత్రికుల్లోని భక్తి భావం. ఆ స్వామిపై భక్తజనకోటికి ఉన్న అచంచల విశ్వాసం. ఎన్జీసీ బృందం ఆ భక్తిపారవశ్యాన్నే అద్భుతంగా చిత్రీకరించిందని టీటీడీ వర్గాలు చెబుతున్నాయి. తిరుమలకు వచ్చే యాత్రికుల్లో అత్యధికులు ఏళ్ల తరబడి క్రమం తప్పకుండా వస్తున్న వారే అధికం. అలా వారు ఎందుకు వస్తున్నారో భక్తుల అభిప్రాయాలను అడిగి వాటిని ఎన్జీసీ చిత్రీకరించింది. తిరుమలలో కొన్ని వందల మంది ఉద్యోగులు పనిచేస్తుంటే అంతకు మించిన సంఖ్యలో భక్తులు శ్రీవారి సేవకుల పేరుతో ఉచితంగా సేవలు అందిస్తుంటారు. స్వామి సన్నిధిలో సేవ చేయడం మహద్భాగ్యంగా భావించి ఆ అవకాశం కోసం ఏడాదికి ముందే వీరు తిరుమల ప్రజా సంబంధాల శాఖ వద్ద తమ పేర్లు నమోదు చేసుకుంటారు. ఏడాది కాలంలో 10 నుంచి 15 రోజుల పాటు తిరుమలలో బస చేసి అన్నదానం, క్యూలైన్ల నిర్వహణ ఇలా వివిధ రకాల పనుల్లో ఉచిత సేవలందిస్తారు. అలా వచ్చేవారిలో ఎంతో మంది కోటీశ్వరులు సైతం ఉంటారు. ఈ క్రమంలోనే ఎన్జీసీ.. శ్రీవారి సేవకుల నమ్మకాలకు కూడా అధిక ప్రాధాన్యమిచ్చి వారి అనుభవాలను, అభిప్రాయాలను చిత్రీకరించింది. ఎన్జీసీ ప్రోమోలో యాత్రికులు, శ్రీవారి సేవకులు తమ అనుభూతి గురించి చెబుతున్నప్పుడు గురైన భావోద్వేగం చూస్తుంటే తన్మయత్వంతో కళ్ల నీళ్లు తిరుగుతాయని, ఎన్జీసీ అంత అద్భుతంగా భక్తుల భావాలను కెమెరాకంటితో ఒడిసిపట్టిందని ఈ ప్రోమో చూసిన టీటీడీ ఉద్యోగులు చెబుతున్నారు.

అన్నదానంపైనా.. 

తిరుమలలోని అన్నసత్రాల్లో శుక్ర, శని, ఆదివారాల్లో 12 టన్నులు, మిగిలిన రోజుల్లో పది టన్నుల బియ్యం వినియోగిస్తారు. అలాగే 1500 కిలోల పప్పు, మూడు టన్నుల కూరగాయలు వాడతారు. రోజుకు సగటున లక్ష నుంచి 1.20 లక్షల విస్తర్లు అన్నదాన సత్రంలో ఖర్చవుతాయి. అయినా ఏ ఒక్క రోజూ ఒక్క చిన్న అపశ్రుతి కూడా దొర్లలేదు. అంత కచ్చితత్వంతో.. అంత పరిశుభ్రంగా ఎలా వండి వడ్డిస్తున్నారనే అంశంపై నేషనల్‌ జియోగ్రాఫిక్‌ చానల్‌ బృందం ప్రధానంగా దృష్టి సారించింది. అన్నదానంలో పనిచేసే కార్మికులు, వాడే పరికరాలు, వడ్డించే విధానం చిత్రీకరించింది.

అపురూపం.. శ్రీవారి వైభవం

తిరుమలలో ఎన్జీసీ బృందం చిత్రీకరించిన మిగతా అన్ని అంశాలూ ఒక ఎత్తైతే.. ఆ శ్రీవారి వైభవం మరొక ఎత్తు. ఆలయం వెలుపల జరిగే ఉత్సవాలతో పాటు బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన నాలుగు రోజుల వాహన సేవలను ఎన్జీసీ చిత్రీకరించింది. స్వామి వారి అలంకరణకు ఎన్ని రకాల పుష్పాలు వినియోగిస్తారు తదితరాలన్నీ పొందుపరిచారు.


43 నిమిషాల అద్భుతం నేషనల్‌ జియోగ్రాఫిక్‌ చానల్‌ తన డాక్యుమెంటరీల్లో వివాదాస్పద అంశాలు ఉండకూడదని భావిస్తుంది. అందుకే చిత్రీకరించిన డాక్యుమెంటరీ ప్రోమోను ముందే సంబంధింతులకు చూపించి అభ్యంతరాలు ఉంటే వాటిని తొలగిస్తుంది. ఈ క్రమంలోనే 43 నిమిషాల నిడివికలిగిన డాక్యుమెంటరీని ఇటీవల టీటీడీ ఈవో సాంబశివరావుకు, ఇతర ముఖ్య అధికారులకు చూపించారు. ఈ ప్రోమో చూసిన టీటీడీ అధికారులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. నిజంగా ఈ డాక్యుమెంటరీ అద్భుతంగా ఉందని, యాత్రికుల భక్తి పారవశ్యాన్ని, తిరుమల వైభవాన్ని ఎన్జీసీ ‘నభూతో..’ అన్న రీతిలో చిత్రీకరించిందని, శ్రీవారి వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేయబోతోందని టీటీడీ అధికారులు తెలిపారు.

Post a Comment

0 Comments